Wednesday, 20 August 2025
డాక్టరునయ్యానోచ్!!
మా యింట్లో నేను తప్ప మా ఇద్దరు అక్కయ్యలు,ఇద్దరు అన్నయ్యలు డాక్టర్లు.నేను ఒక్క దాన్నే బ్లాక్ షీప్ ఆఫ్ ది ఫామిలీ.నేను గుమాస్తా అయ్యాను.
రాత్రి కలలో....
ఒక గదిలో ఉన్నాను సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకుని.చాలా మంది హడావుడిగా తిరుగుతున్నారు అక్కడ.క్యూలో కొంత మంది నిలుచుకోని ఉన్నారు.నేను వాళ్ళతో నిలుచుకున్నాను.ఒక ఆమె అందరి డాక్యుమెంట్స్ చూస్తూ ఉంది.నా చేతిలో కాగితాలు కూడా ఆమెకు ఇచ్చాను.అవి చూసింది.తలెత్తి నీవు ఎన్ట్రెన్స్ రాసావా అని అడిగింది.లేదు అని చెప్పాను.మళ్ళీ ఆ కాగితాలు చూసి నీవు సెంట్రల్ స్కూలు కదా అనింది.అవును అన్నాను.ఇంకేమీ మాట్లాడకుండా,పేపర్స్ పైన సీలు వేసి,సర్టిఫికేటు ఇచ్చింది.చూస్తే డాక్టరు అయినట్లు సర్టిఫికేటు!ఇంక నా ఆనందం చెప్పనలవి కావటం లేదు.గబ గబా బ్యాంకుకు వెళ్ళాను.బాలు కనిపించాడు.నేను డాక్టరు అయ్యాను అని చెప్పాను.మా కొలీగ్స్ అందరికీ చెప్పాను.అందరూ షాక్ అయ్యారు.అందరికీ సంతోషం అయింది.అప్పుడు మొదలు అయింది టెన్షను.హౌస్ సర్జన్సీ కూడా చేయలేదు.పల్స్ చూడటం రాదు.పాల్పిటేషన్స్ చెక్ చేయడం తెలీదు.తప్పీ దారీ డాక్టరు అని ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటే పరిస్థితి ఏంటి???ఎవరైనా కడుపు నొప్పి అనో,కాలు నొప్పి అనో,లేకపోతే జ్వరమనో,తలనొప్పి అని వస్తే???అంతాబెబ్బెబ్బే!!!
ఇంక ఇలా అయితే లాభం లేదు.ఎక్స్పీరియెన్స్ సంపాదించాలి.చిన్నక్కయ్యను అడుగుదామా,ఇద్దరమూ కలిసి క్లినిక్ పెట్టుకుందామని.మా వాళ్ళను అడుగుతున్నా మీకు తెలిసిన డాక్టర్లకుచెప్పండి,నన్ను చేర్చుకుని పని నేర్పించేదానికి.ప్రియాంకాని కూడా అడిగా మీ హాస్పిటల్లో చెప్పి నాకు పోస్టింగు ఇప్పించవే అని.
అప్పుడు అర్థం అయింది ఒట్టి సర్టిఫికేట్లు ఉంటే చాలదు.పనితనం కూడా ఉండాలని!
Monday, 4 August 2025
రాయల్ ఎన్ ఫీల్డ్ కి సైకిల్ పెడల్స్!
సైకిలు కూడా తొక్కడం రాని నేను రాయల్ ఎన్ ఫీల్డ్ తొక్కుతున్నాను.కలలు నిజంగా చాలా గ్రేట్ కదా!నేను ముప్పైలలో టూ వీలర్ నేర్చుకునేదానికి చాలా కష్ట పడ్డాను.కానీ రాలేదు.ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది.
కల....
ఈ రోజు బాలన్స్ షీట్ డే.బ్యాంకులో చాలా పని ఉంటుంది.అన్నానికి ఇంటికి వచ్చాను.మళ్ళీ ఆకలి అయితే తినే దానికి తీసుకెళదాము అంటే ఏమీ కనిపించడం లేదు.వంటిల్లు అంతా వెతుకుతున్నాను.ఏవో రెండు కేకు ముక్కలు కనిపించాయి.అవి అన్నా తీసుకెళదాము అనుకుంటే అవి పెట్టుకునేదానికి డబ్బా ఏమీ కనిపిండం లేదు.టైము అయిపోతున్నది.నా హడావుడి చూసి విజయ లక్ష్మీనారాయణతో అంటున్నది.మీ పెద్దొదినను వదిలి పెట్టి రండి అని.వాడు సరే వదినా రా,నేను వెళుతూ ఉంటాను అని బయలు దేరి వెళ్ళిపోయాడు.వాడి బండిలో తీసుకెళ్ళకుండా,వెనుక ఇంకో బండిలో రావటాన్ని తీసుకెళ్ళటం అని అంటారా అని ఆశ్చర్యపోయాను.చూస్తే ఆరుబయట నిజంగా ఇంకో మోటారు సైకిలు ఉంది.దగ్గరకు పోయిచూస్తే రాయల్ ఎన్ ఫీల్డ్!నాకేమీ భయమనిపించలేదు.చిన్నగా మోటారు సైకిలు ఎక్కాను.చిన్నగా పోతున్నది.లక్ష్మీనారాయణ వెనక్కి తిరిగి,వదినా!పక్క సందులోకి తిరుగు,అంటూ ముందుకు పోయాడు.వాడి వెనక వెళ్ళాలంటే తొందరగా పోవాలి.చూస్తే
పెడల్స్ ఉన్నాయి.రయ్!రయ్ అంటూ సైకిలులాగా తొక్కుకుంటూ పోయాను.
ఇంటికి వచ్చిన తర్వాత వాడితో అంటున్నాను.నాకు ఇంజను స్టార్ట్ చేయటం,క్లచ్ అవి చూపించి నేర్పించురా.రెండు రోజులు ఇంటి దగ్గర నాలుగు రౌండ్లు వేసి నేర్చుకుంటాను అని.సైకిలు వచ్చు కాబట్టి బాలెన్సింగ్ ఓకే.రాము,మోహను కూడా ఇంట్లోనే ఉన్నారు.యూ ఓన్లీ లివ్ టైస్ సినిమాకు టికెట్లు తీసుకుంటున్నాను అని అన్నాదమ్ముళ్ళు అనుకుంటున్నారు.నన్నుకూడా పిలిచి ఉంటే బాగుండు అనుకున్నాను.కానీ పైకి అడగలేదు.
Subscribe to:
Posts (Atom)