Tuesday, 7 October 2025

భోజనాలకు పిలిచారు…పెట్టలేదు

కాలేజీలో ఉన్నాను.చెప్పేది ఒక్క ముక్క అర్థం కావటంలేదు.సంవత్సరం అంతా రాకుండా ఒక్కరోజు వస్తే ఇంకెట్లా ఉంటుంది.పరీక్షలో పాస్ కావాలంటే ఎలా?ఏమీ రాకుండా ఎలా రాయడం?క్లాసులో వెంకటరమణ,రామచంద్రా రెడ్డి వాళ్ళు మంచి స్టూడెంట్స్.వాళ్ళని అడగాలి అని అనుకుంటున్నాను.అక్కయ్యను డాక్టరు దగ్గర కూర్చోబెట్టి,దగ్గరలో ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను.అక్కడకు రుక్మిణి వచ్చి ఉంది.పార్టీ ఉంది కాబట్టి నన్ను కూడా ఉండమనింది.చిన్నగా బ్యాంకు కొలీగ్స్ కూడా వస్తున్నారు.ఏమి అని అడిగితే రెడ్డిగారు మన బ్యాంకు కస్టమర్ కదా!భోజనాలకు పిలిచాడు అని చెప్పారు.మరి నాకు ఎందుకు తెలియలేదు అని అనుమానం వచ్చింది.మళ్ళీ అర్థం అయింది.నేను రిటైర్డ్ కదా!బ్రాంచ్ లో సర్క్యులర్ పంపించి ఉంటారు.ఇంకా వడ్డనలు మొదలు పెట్టలేదు.అందరూ వచ్చారు.నేను తెలిసిన వాళ్ళు కనిపిస్తే సర్ అని వెళ్ళి పలకరిస్తాను.కానీ వాళ్ళు ముందు నన్ను గమనిస్తే అలా పలకరించరు.బాథ వేస్తుంది.నేనుకూడా పలకరించకూడదు అనిపిస్తుంది.కానీ వాళ్ళలా ఉండలేను.ఇదే నా బలహీనత.నేను,సూర్యకుమారి గోడల పైన ఫోటోలు చూస్తూ ఉన్నాము.ఇంతలో అన్ని కుర్చీలు నిండి పోయాయి.వడ్డన మొదలు పెట్టేసారు.మేమిద్దరము నిలబడిపోయాము.మమ్మల్ని బయట పందిరి కింద కూర్చోమన్నారు.కూర్చున్నాము.కొంచెం సేపటికి వేరే ఇంకొందరు వచ్చారు.వారికి కూడా వడ్జనలు మొదలు పెట్టారు.మా దగ్గరకు రాలేదు.కొంచెం సేపు చూసి,సూర్యకుమారి వడ్డన చేసేవాళ్ళను అడిగింది.వండిన అన్నం బంతిలో ఉన్నవారికే సరిపోయేటట్లు లేదు.మళ్ళీ వండుతున్నాము అని అన్నారు.ఇంక ఇది అయ్యే మేళం కాదని కిందకు వచ్చేసాను.అక్కడ ఆటో అబ్బాయి కనిపించాడు.వెనక్కి తిరిగి చూస్తే అక్కయ్య కూర్చుని ఉంది ఆటోలో.అయ్యో!ఇంత సేపు అక్కయ్య నాకోసం కాచుకుని ఉందా అని దిగులు వేసింది.సారీ అక్కయ్య!పోదా పద అని ఆటో ఎక్కాను.