Friday, 12 December 2025

క్షణంలో అంతా తారు మారు

రాత్రి కలలో మదనపల్లెలో ఉన్నాను.ఏదో పని పైన నెల్లూరుకు పోయి వచ్చాను.ఇంటికి వచ్చే టప్పటికి తలుపులు తెరిచి ఉన్నాయి.లోపలకు పోయి చూస్తే ఇంకో సంసారం ఉంది. ఒక నవారు మంచం పైన ఒక పెద్దాయన పడుకుని ఉన్నాడు.బహుశ మంచాన పడినట్లు ఉంది.ఆ ప్రక్కనే ఇంకొకతను,బహుశ పెద్దాయన కొడుకు,నేల మీద చాప వేసుకుని పండుకుని చూరు చూస్తున్నాడు.వంటింట్లో ఒకామె వంట చేస్తుంది.సందులో చిన్న పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది.నా ఇంట్లోకే కదా నేను వచ్చింది!మరి వీళ్ళంతా ఎవరు?ఇల్లు గల్ల ఆమె ఎదురు ఇంట్లో ఉంది.నేను ఎటూ ఇప్పట్లో రాను అని వేరే వాళ్ళకు బాడుగకు ఇచ్చింది.డబల్ థమాకా కదా!నేనూ బాడుగ ఇస్తాను,వాళ్ళూ ఇస్తారు. పోయి ఆమెను అడిగాను,ఏంది ఇది.గమ్మునఉంది.కొత్తగా చేరిన వాళ్ళు పొమ్మన్నా తొందరగా పోలేరు.అసలు నా విషయం.నా సామానులు వెనక్కి ఎక్కడో ఉన్నాయి.అవి ఇప్పటికిప్పుడు వాడుకోలేనేమో అని పించింది.నేను మామూలుగా ఎవరితో ఘర్షణ పడను.కానీ ఆమెను అరుస్తున్నాను,తిడుతున్నాను,ఆఖరికి సినిమాలోలాగా చెంప ఛెళ్ళు మనిపించాను కూడా.కానీ ఆమె గమ్మునే ఉంది,తప్పు తనదే కదా! మా కొలీగ్స్ కి చెప్పాను.ఎందుకు మేడమ్ ఈ తలకాయ నొప్పి?రాము వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఆ మథ్య ఖాళీగా ఉణ్ణింది.ఇప్పుడే కనుక్కుంటాను ఉండండి అని ఫోన్ చేస్తున్నాడు. నాకంతా గందర గోళంగా ఉంది.నాకు అసలే సర్దడం రాదు.నేను ఎప్పటికి ఇవంతా సర్దాలి.ఆ ఇల్లు ఖాళీగా ఇంకా ఉందో,లేదో?ఎప్పుడు మార్చాలి?ఇంకెప్పుడు అక్కడ సర్దాలి?హతవిథీ!