Monday, 3 August 2026
టైలర్ తో తంటాలు
రాత్రి కలలో...
టైలర్ కి చాలా బ్లౌజు పీసెస్ ఇచ్చాను కుట్టేదానికి.తిప్పించుకుంటున్నాడు మూడు నెలల నుంచి.ఆఖరికి ఇప్పుడు తీసుకొచ్చాడు.గబగబా తీసుకుని లోపలకు వెళ్ళాను,సరిగ్గా కుట్టాడో లేదో చూసుకునేదానికి.అంక చండాలంగా కుట్టున్నాడు.రౌండుగా పై మెడ,మోచేతుల దాకా రెట్టలు,చొక్కాలాగ పొడుగ్గా ఉంది.నిజానికి మా పెద్దన్నయ్య ఫుల్ హాండ్స్ చొక్కా,చిన్నప్పుడు నేను వేసుకునేది లాగా ఉంది.ఏ కోశానా జాకెట్టు అని ఎవరూ అనరు.సర్ అంటూ బయటకు వచ్చాను.ఏందిరా!ఈ కుట్టడం?అంటూ.నేను కాదు మేడమ్ కుట్టింది.మా ఓనర్ వేరే అతని చేత కుట్టించాడు.మీరు తొందరగా కావాలని అడిగారు అని.తొందర ఏంది?నా మొహం!మూడు నెలల నుంచీ తిప్పుకుంటున్నాడు.
ఇంతలో మా అమ్మాయి వచ్చింది,ఏందమ్మా?అంటూ.చూడవే!ఎట్లా భ్రష్టు పట్టించాడో!మంచి జాకెట్టు ముక్కలు ఇచ్చాను అని వాపోయాను.రేయ్!కొంచెం జాకెట్టు లాగా కనిపించేటట్లు ఆల్టర్ చెయ్యరా,దణ్ణం పెడతాను అన్నాను వాడి తట్టు మళ్ళి.అమ్మాయి అంది.అమ్మా!ఎవరికీ దణ్ణాలూ,దస్కాలూ పెట్టనక్కర లేదు.ఆల్టరేషన్ అంటే ఇంకా భ్రష్టు పట్టిస్తాడు.కనీసం పడుతున్నాయి కదా.ఇంట్లో ఉండేటప్పుడు వేసుకునేదానికి వాడేయ్యి.ఒక పని అయిపోతుంది అని ఉచిత సలహా ఇచ్చి లోపలకు పోయింది.
నిజానికి నాకూ,టైలర్స్ కీ ఏదో జన్మ జన్మల శత్రుత్వం ఉందేమో అని నా ప్రగాఢ విశ్వాసం.ఎందుకంటే కరెక్టుగా సమయానికి ఇచ్చేవాడు సరిగ్గా కుట్టడు.మంచిగా కుట్టేవాడు ఆర్నెల్లకు కూడా ఇవ్వడు.వాడికి డిమాండు అంతలా ఉంటుంది.నేను మాచింగ్ కోసం ఆరాటపడను.ఏదో చీరకు ఇంకేదో జాకెట్టు...ఏది కనిపిస్తే అది వేసుకుంటాను.ఈ లెక్కన వీడు జాకెట్టు కుట్టి ఇచ్చేటప్పటికి చీర ఎప్పుడో పాత బడి పోయి ఉంటుంది.
Saturday, 1 August 2026
మా ఇంటికి దారేది?
రాత్రి కలలో...
నెల్లూరు నుంచి తిరుపతికి ఒక్కదాన్నే బయలుదేరాను.తిరుపతిలో కరెక్టట్ గా ఏ స్టాప్ లో దిగాలో కొంచెం డౌటు.తిరుపతి పొలిమేరలు రాగానే ఒక అమ్మాయి మూడేళ్ళ పాపను,చంకలో బిడ్డను ఎత్తుకుని,డ్రైవరు దగ్గరకు వెళ్ళి,తను దిగాల్సిన స్టాప్ చెప్పింది.నేను దిగాల్సింది కూడా అక్కడే.డ్రైవరు ఆపగానే ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలతో దిగింది.ఆ అమ్మాయి వెనకల నేనూ దిగబోయాను.ఆఖరి మెట్టు ఆకాశంలో ఉన్నట్లు ఉంది,ఎత్తుగా.ఒక్క క్షణం భయం వేసింది.దిగగలనా అని.మళ్ళీ నేనే ధైర్యం తెచ్చుకున్నాను.మూడేళ్ళ పాప దిగింది.చంకలో బిడ్డతో ఉండే అమ్మాయి దిగింది.నాకేమి భయం?దిగేసాను.బస్ స్టాండులో రెండు తట్లు ఎంట్రెన్సులు ఉన్నాయి.ఏ తట్టు వెళితే మా ఇంటి తట్టు అవుతుంది?నాకు చిన్నప్పటి నుంచీ కుడి ఎడమ,దిక్కులూ మూలలు గందరగోళం.అర్థం కాదు.అందుకే ఆ అమ్మాయి వెళ్ళిన తట్టే వెళ్ళాను.ఒక్క ఆటో కూడా లేదు.మామూలు రిక్షా ఆయన కనిపించాడు.నన్ను ఎక్కించుకుని,ఐదు మైళ్ళు తొక్కాడంటే ఆరిపోతాడు.బక్క జీవిని బాథ పెట్టడం ఇష్టం లేక బేరం ఆడలేదు.కొంచెం ముందరకు నడిచాను.ఇళ్ళు కనిపించాయి.ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు కనిపించారు.అడిగాను.కపిల తీర్థం కు దారి ఇటా,అటా అని.మాకు తెలియదు అన్నారు.మా ఇల్లు కపిల తీర్థం రోడ్డులో.ఎట్లా పోతే ఆ రోడ్డు వస్తుందో అర్థం కావటం లేదు.చిన్నగా ఇళ్ళ మధ్యలో పోతున్నాను.ప్రతి రెండు అడుగులకూ ఒక గుడి ఉంది.నల్ల రాతి విగ్రహాలు భలే ఉన్నాయి.చాలా మంది పొద్దున్నే తలకు పోసుకుని,గుడి ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఒక ఆమెను అడిగాను.కపిల తీర్థానికి ఎటు పోవాలి అని.నేరుగా పోతే మెయిన్ రోడ్డు వస్తుంది.అక్కడ కనుక్కోండి అని అనింది.చిన్నగా మెయిన్ రోడ్డు వచ్చింది.ఎదురుగా పెద్ద బిల్డింగు,బయట బోర్డు కనిపించింది.అది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు.అక్కడ నుంచి నేరు లైను కపిల తీర్థానికి వెళుతుంది.అమ్మయ్య!అని రిలాక్స్ అయ్యాను.అక్కడే బస్ స్టైపులో కాఫీ,టీ అమ్ముతున్నారు.పెనం పైన దిబ్బ రొట్టె ఉంది.కొంచెం కాఫీ తాగి,ఇడ్లీనో,దోసెనో తిని వెళితే ఇంటికి వెళ్ళగానే వంట జోలికి పోయేపనిలేదు కదా!ఆ అబ్బాయిని కాఫీ అడిగాను.
Subscribe to:
Posts (Atom)