Monday, 3 August 2026

టైలర్ తో తంటాలు

రాత్రి కలలో... టైలర్ కి చాలా బ్లౌజు పీసెస్ ఇచ్చాను కుట్టేదానికి.తిప్పించుకుంటున్నాడు మూడు నెలల నుంచి.ఆఖరికి ఇప్పుడు తీసుకొచ్చాడు.గబగబా తీసుకుని లోపలకు వెళ్ళాను,సరిగ్గా కుట్టాడో లేదో చూసుకునేదానికి.అంక చండాలంగా కుట్టున్నాడు.రౌండుగా పై మెడ,మోచేతుల దాకా రెట్టలు,చొక్కాలాగ పొడుగ్గా ఉంది.నిజానికి మా పెద్దన్నయ్య ఫుల్ హాండ్స్ చొక్కా,చిన్నప్పుడు నేను వేసుకునేది లాగా ఉంది.ఏ కోశానా జాకెట్టు అని ఎవరూ అనరు.సర్ అంటూ బయటకు వచ్చాను.ఏందిరా!ఈ కుట్టడం?అంటూ.నేను కాదు మేడమ్ కుట్టింది.మా ఓనర్ వేరే అతని చేత కుట్టించాడు.మీరు తొందరగా కావాలని అడిగారు అని.తొందర ఏంది?నా మొహం!మూడు నెలల నుంచీ తిప్పుకుంటున్నాడు. ఇంతలో మా అమ్మాయి వచ్చింది,ఏందమ్మా?అంటూ.చూడవే!ఎట్లా భ్రష్టు పట్టించాడో!మంచి జాకెట్టు ముక్కలు ఇచ్చాను అని వాపోయాను.రేయ్!కొంచెం జాకెట్టు లాగా కనిపించేటట్లు ఆల్టర్ చెయ్యరా,దణ్ణం పెడతాను అన్నాను వాడి తట్టు మళ్ళి.అమ్మాయి అంది.అమ్మా!ఎవరికీ దణ్ణాలూ,దస్కాలూ పెట్టనక్కర లేదు.ఆల్టరేషన్ అంటే ఇంకా భ్రష్టు పట్టిస్తాడు.కనీసం పడుతున్నాయి కదా.ఇంట్లో ఉండేటప్పుడు వేసుకునేదానికి వాడేయ్యి.ఒక పని అయిపోతుంది అని ఉచిత సలహా ఇచ్చి లోపలకు పోయింది. నిజానికి నాకూ,టైలర్స్ కీ ఏదో జన్మ జన్మల శత్రుత్వం ఉందేమో అని నా ప్రగాఢ విశ్వాసం.ఎందుకంటే కరెక్టుగా సమయానికి ఇచ్చేవాడు సరిగ్గా కుట్టడు.మంచిగా కుట్టేవాడు ఆర్నెల్లకు కూడా ఇవ్వడు.వాడికి డిమాండు అంతలా ఉంటుంది.నేను మాచింగ్ కోసం ఆరాటపడను.ఏదో చీరకు ఇంకేదో జాకెట్టు...ఏది కనిపిస్తే అది వేసుకుంటాను.ఈ లెక్కన వీడు జాకెట్టు కుట్టి ఇచ్చేటప్పటికి చీర ఎప్పుడో పాత బడి పోయి ఉంటుంది.

Saturday, 1 August 2026

మా ఇంటికి దారేది?

రాత్రి కలలో... నెల్లూరు నుంచి తిరుపతికి ఒక్కదాన్నే బయలుదేరాను.తిరుపతిలో కరెక్టట్ గా ఏ స్టాప్ లో దిగాలో కొంచెం డౌటు.తిరుపతి పొలిమేరలు రాగానే ఒక అమ్మాయి మూడేళ్ళ పాపను,చంకలో బిడ్డను ఎత్తుకుని,డ్రైవరు దగ్గరకు వెళ్ళి,తను దిగాల్సిన స్టాప్ చెప్పింది.నేను దిగాల్సింది కూడా అక్కడే.డ్రైవరు ఆపగానే ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలతో దిగింది.ఆ అమ్మాయి వెనకల నేనూ దిగబోయాను.ఆఖరి మెట్టు ఆకాశంలో ఉన్నట్లు ఉంది,ఎత్తుగా.ఒక్క క్షణం భయం వేసింది.దిగగలనా అని.మళ్ళీ నేనే ధైర్యం తెచ్చుకున్నాను.మూడేళ్ళ పాప దిగింది.చంకలో బిడ్డతో ఉండే అమ్మాయి దిగింది.నాకేమి భయం?దిగేసాను.బస్ స్టాండులో రెండు తట్లు ఎంట్రెన్సులు ఉన్నాయి.ఏ తట్టు వెళితే మా ఇంటి తట్టు అవుతుంది?నాకు చిన్నప్పటి నుంచీ కుడి ఎడమ,దిక్కులూ మూలలు గందరగోళం.అర్థం కాదు.అందుకే ఆ అమ్మాయి వెళ్ళిన తట్టే వెళ్ళాను.ఒక్క ఆటో కూడా లేదు.మామూలు రిక్షా ఆయన కనిపించాడు.నన్ను ఎక్కించుకుని,ఐదు మైళ్ళు తొక్కాడంటే ఆరిపోతాడు.బక్క జీవిని బాథ పెట్టడం ఇష్టం లేక బేరం ఆడలేదు.కొంచెం ముందరకు నడిచాను.ఇళ్ళు కనిపించాయి.ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు కనిపించారు.అడిగాను.కపిల తీర్థం కు దారి ఇటా,అటా అని.మాకు తెలియదు అన్నారు.మా ఇల్లు కపిల తీర్థం రోడ్డులో.ఎట్లా పోతే ఆ రోడ్డు వస్తుందో అర్థం కావటం లేదు.చిన్నగా ఇళ్ళ మధ్యలో పోతున్నాను.ప్రతి రెండు అడుగులకూ ఒక గుడి ఉంది.నల్ల రాతి విగ్రహాలు భలే ఉన్నాయి.చాలా మంది పొద్దున్నే తలకు పోసుకుని,గుడి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక ఆమెను అడిగాను.కపిల తీర్థానికి ఎటు పోవాలి అని.నేరుగా పోతే మెయిన్ రోడ్డు వస్తుంది.అక్కడ కనుక్కోండి అని అనింది.చిన్నగా మెయిన్ రోడ్డు వచ్చింది.ఎదురుగా పెద్ద బిల్డింగు,బయట బోర్డు కనిపించింది.అది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు.అక్కడ నుంచి నేరు లైను కపిల తీర్థానికి వెళుతుంది.అమ్మయ్య!అని రిలాక్స్ అయ్యాను.అక్కడే బస్ స్టైపులో కాఫీ,టీ అమ్ముతున్నారు.పెనం పైన దిబ్బ రొట్టె ఉంది.కొంచెం కాఫీ తాగి,ఇడ్లీనో,దోసెనో తిని వెళితే ఇంటికి వెళ్ళగానే వంట జోలికి పోయేపనిలేదు కదా!ఆ అబ్బాయిని కాఫీ అడిగాను.

Monday, 13 July 2026

CM గారు,వారి కోడలితో భేటీ

రాత్రి కలలో....నేను,ప్రసాదు పిల్లలను పార్కుకు తీసుకెళ్ళాము.వాళ్ళు ఆడుకుంటున్నారు.ప్రసాదు కారు ఎక్కు అని నన్ను తీసుకెళ్ళాడు.అక్కడ తాటి చెట్లు టెంకాయ చెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి.అందులో ఒక దానికి మొత్తం పూలతీగె చుట్టుకుని ఉంది పైదాకా.చిన్న చిన్న తెల్ల పూలు నక్షత్రాల్లా చెట్టు పైదాకా కనిపిస్తున్నాయి.నాకు అది చూపించేగానికి పిలుచుకుని వచ్చాడు.పిల్లలు భయపడతారు ఒంటరిగా...అని వెనక్కు వచ్చేసాము. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కోడలు వాకింగ్ చేస్తుంది.నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి అడిగాను నాకు కొంచెం సహాయం కావాలని.ఇంతలో CM గారు వచ్చారు తనను పిలుచుకుని వెళ్ళేదానికి.నన్ను చూసి ఏమి కావాలి అన్నారు.నేను చెప్పడం మొదలుపెట్టాను.సర్,నేను 1976లో రిసర్చ్ లో చేరాను.role of growth promoters and growth retardants in cucurbutacea...నా ప్రాజెక్ట్.1977లో UGC ఫెలోషిప్ వచ్చింది.కానీ 1978లో బాంకు ఉద్యోగం వచ్చింది అని మానేసాను.నేను కంటిన్యూ చేయాలంటే యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు.మీరు ఒకమాట చెప్పారంటే చాలు.నేను రిసర్చ్ కంటిన్యూ చేసుకుంటాను.నా దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి.UGC సాంక్షన్ లెటర్ తప్ప.కావాలంటే రేపు పొద్దున మీ ఇంటికి తీసుకు వచ్చి చూపిస్తాను. అలాగే పొద్దున్నే,పరగడుపున వెళ్ళాను.వాళ్ళంతా ఇంకా రెడీ కూడా కాలేదు.వాళ్ళతోటి నాకు ఉప్మా పెట్టారు,తినమని.ప్పపంచమంతా,ప్రతి ఇంట్లో పొద్దున ఉప్మానే చేసేటట్లు ఉంది.తొందరగా అయిపోతుందని.ఇంతలో మైథిలి ఫోన్ చేసింది...ఇంట్లో టిఫిన్ ఉంటే వస్తాను మేడమ్ అంటూ.సరే రా!అందరమూ కలిసి ఉప్మా తిందాము ..అని అన్నాను.

Saturday, 11 July 2026

ఎర్రటి సరిగె అంచు వెంకటగిరి చీరలో అత్త

ఈ మధ్య big island,hawaii కి వెళ్ళాము.విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి,బస్ స్టాప్ దగ్గరకు వెళుతున్నాము.అర్థరాత్రి అయింది.పిల్లలు భరిణె పురుగులను చూసారు.కొన్ని పెద్దవి ఎగురు తున్నాయి.వీళ్ళు కెవ్వు కెవ్వు మంటూ పరుగులు...వాళ్ళ పైన ఎక్కడ వాలతాయో అని.నిన్నంతా పాత ఫోటోలు చూస్తున్నాను..।అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మీ వ్రతమూ,అత్తతో మా ఫోటోలు. రాత్రి కలలో...।నెల్లూరు లోని మెడ్రాసు బస్ స్టాండు ఇంట్లో అందరమూ ఉన్నాము.దొడ్డి తట్టు వెళ్ళి చూసాను.కాలు ఆనించేదానికి వీలు లేకుండా భరిణె పురుగులు.ఓ యమ్మో!ఇవి ఇంట్లోకి ఏమైనా వచ్చాయా అని వెనక్కి తిరిగి చూసాను.హమ్మయ్య!ఇంట్లోకి రాలేదు.జాగ్రత్తగా చెప్పులు వేసుకుని,ఇంటి ముందర తట్టుకు బయలు దేరాను.అందరూ అక్కడే ఉన్నారు.వాసు అన్నాడు.వదినా!ఈ సారి అందరికీ సర్ప్రైజ్.నేను ఎక్కువ మాట్లాడను అనుకుంటారు కదా!అలా అని పట్టు శాలువా కప్పాడు నాకు.వదినకు చీర,జాకెట్టు తాంబూలంలో పెట్టి ఇవ్వు అని జానకితో అన్నాడు.నేను అన్నాను.మరీ వీథిలో,బయట ఎందుకులే,లోపల ఇద్దువుగానీ జానకి అని.అందరమూ తలుపూరు బయలు దేరుతున్నాము.అత్త కొత్త సరిగంచు ఎర్ర వెంకటగిరి చీర,ఎర్ర జాకెట్టు వేసుకుని వచ్చింది.భలే ఉంది.మెరిసి పోతూ ఉంది.అత్తా!మనము తలుపూరు వెళ్ళి,అక్కడ కదా వరలక్ష్మీ వ్రతం చేసుకునేది.ప్రయాణంలో చీర నలిగి పోతుంది కదా!అని అన్నాను.పరవా లేదులే,అమ్మాయి.అనవసరంగా ఇంకో గంట లేచు అవుతుంది అని ఒకేసారి రెడీ అయ్యాను అని అత్త అంది.

Wednesday, 17 June 2026

ISC realisation అర నిమిషంలో

రాత్రి కలలో... బ్రాంచ్ కి కొత్త మేనేజరు వచ్చాడు.కాఫీకని లంచ్ రూముకి వెళితే కలిసాడు.ఇద్దరమూ హాయ్ అనుకుని,మాట్లాడుకున్నాము.అట్లానే మాట్లాడుకుంటూ సీటు దగ్గరకు వచ్చాను.నలుగురు కొలీగ్స్ నా వెనకల అంటున్నారు.ఎవరు వచ్చినా మొదట ఫ్రెండు చేసుకుంటుంది అని.నేరుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అన్నాను.నేను రోజీ చీక్సు,ఫెయిర్ స్కిన్ లా కాదు.నేను మెలికలు తిరగడం,మందగమనలా కాదు.అందరినీ సమానంగా చూస్తాను.IQ,తెలివితేటలతో ఫ్రెండ్సు చేసుకుంటాను.చిన్న సైజు సంభాషణ చెప్పి,నా సీటు దగ్గరకు వెళ్ళాను.కస్టమరు ISC(inward sights for collection) ఇంటిమేషన్ లెటరు పట్టుకొచ్చాడు.తీసుకుని చూసాను.పాత ఇన్స్ట్రుమెంటు లాగుంది.పాత రిజిస్టరు వెతికి,చూసాను.నంబరు 82,అమౌంటు రూ.1066/.కనిపించింది.రౌండు చేసి,డేట్ ఆఫ్ రియలైజేషను వేసాను.వెంటనే చలాను రాసిచ్చాను.అతను చాలా ఖుష్!తొందరగా చేసిచ్చానని.తాంక్స్ చెప్పి వెళ్ళాడు.

Friday, 12 June 2026

కాలేజీ కెళ్ళాలంటేనే కష్టాలు

రాత్రి కలలో.... పొద్దున లేచి కాలేజీకని హడావుడిగా రెడీ అవుతున్నాను.గబ గబా మెట్లు దిగి బయలుదేరాను.మునిసిపల్ ఆఫీసు దగ్గరకు వస్తున్నాను...ఇంతలో కాలేజీ బస్సు రై రై అంటూ దూసుకుని పోయింది.స్టాప్ లో ఎవరూ ఉన్నట్లు లేరు.అందుకే ఆగినట్లు లేదు.ఆటో స్టాండు దగ్గరకు వెళ్ళాను.SPW కాలేజీకి ఎంత అని అడిగాను.ఐదు వందలు అన్నాడు.నిన్నటి దాకా పది రూపాయలకే వచ్చారుకదా!ఆఖరుకు మూడు వందలకు ఒప్పుకున్నాడు.ఇంతలో పక్కనే ఉన్న ఇంకో ఆటో అతను రెండు వందలకు వస్తాను అన్నాడు.సరే అంటే ఇక్కడే ఉండండి.నా ఆటో తెస్తాను అని వెళ్ళాడు.మిగిలిన వాళ్ళంతా భయపెట్టారు.వాడికి అసలు లైసెన్ను లేదు.అసలు ఆటో కూడా వాడిదికాదు అంటూ.కానీ నేను ఆ ఆటోలోనే ఎక్కాను.ఆటో దేవేంద్ర తియేటరు దగ్గరకు రాగానే,నా దగ్గర డబ్బులు అస్సలు లేవని గుర్తొచ్చింది.గబక్కని ఆటో ఆపి,ఇంటికి పరుగెత్తాను.వీథిలో వాళ్ళందరూ చూస్తున్నారు..కాలేజీకి పోకుండా ఇంటికి ఎందుకు వెళుతున్నాని.ఏమ్మా?ఏమైంది?అని అడిగింది అమ్మ. అమ్మకు చెప్పాను ఆటోకు రెండు వందలు అడిగారు అని.అమ్మ నా పర్సులో ఏభై రూపాయల కాగితాలు కొన్ని కుక్కింది.పెరుగన్నం డబ్బాలో పెట్టిచ్చింది.మరీ ఎక్కువ కదమ్మా ఆటోకి రెండు వందలు అంటే.యాభైకో,వందకో వస్తారేమో అడుగు అంది అమ్మ.సరే అని కిందకు పరుగులు తీసాను.వీథి చివర రోడ్డుకు ఆటు పక్కన ఆటో కనిపించింది.పిలిస్తే వచ్చాడు అతను.దగ్గరకు వస్తే అది ఆటో కాదు.కారు,టాపు కూడాలేదు.SPW కి వెళ్ళాలి.కారు అంటే ఎక్కువ కదా అని అన్నాను.వందకు వస్తావా అని అడిగితే సరే అని ఎక్కించుకున్నాడు.చిన్నగా,ఎవరు కనిపించినా ఆగుతూ,ఎక్కుతారా అని అడుగుతూ పోతున్నాడు.

Monday, 8 June 2026

Much ado about nothing అంటే ఇదే కదా!

రాత్రి కలలో..... తెల్లవారే లేచి నెల్లూరు బయలుదేరాలి.అందులో శుక్రవారం!తప్పకుండా తలకు పోసుకుని వెళ్ళాలి.పొద్దున్నే లేచి వంటింట్లోకి వెళ్ళాను.అత్త కూర్చుని ఉంది పొయ్యి ముందర.కుంపట్లో పెద్ద గిన్నెలో నీళ్ళు కాగుతున్నాయి.పరవాలేదు.ఇంతలోపల వేసుకోవాల్సినవి,తీసుకెళ్ళాల్సిన బట్టలు సర్దుకుని వస్తాను అని లోపలకు వెళ్ళాను.పని చూసుకుని వచ్చి చూస్తే గిన్నెలో నీళ్ళు చల్లగా ఉన్నాయి.అదేంటి?చిన్నమామ కాగిన తీసుకుని వెళ్ళిపోయడు తను స్నానం చేసేదానికి.అసలే తలకు పోసుకోవాలి.ఒక గిన్నె చాలదు.ఇది కాగేదెప్పుడు?మళ్ళీ ఇంకో గిన్నె కాగేది ఎప్పుడు?ఇట్లాకాదు అని స్నానాల గదిలోకి వెళ్ళి చూసాను.కట్టెల పొయ్యిలో నిప్పులు నివురు గప్పి ఉన్నాయి.నాలుగు కట్టె పుల్లలు వేసి విసిరాను.మంట రాజుకుంది.ఇంక ఫరవాలేదు.అండాలో నీళ్ళు పోసి వచ్చాను.ఇంట్లోకి పోయి వస్తుంటే రాముడు వంటింటి దగ్గర ఉన్నాడు.కాఫీ కోసమేమో?రేయ్!పాలు ఇంకా రాలేదు.అన్నాను.వెంటనే చిన్నమామ,పాలు ఇప్పుడే వచ్చాయి అమ్మాయి అన్నాడు.ఇంకేముంది?వెళ్ళి డికాషన్ పెట్టి,పాలు కాచాను. మళ్ళీ దొడ్లోకి వచ్చి చూస్తే నీళ్ళు ఇంకా కాగలేదు.ఇట్లాకాదు అని మూడు రాళ్ళు పెట్టి,వాటి పైన నీళ్ళ గిన్నె పెట్టి,మళ్ళీ మంట రాజేస్తున్నాను.ఇంతలో లక్ష్మీనారాయణ వచ్చాడు.వదినా!సింగు వాళ్ళ అక్కకు బాగలేదంట.నీతో మాట్లాడాలి అంటున్నాడు.ఆ అబ్బాయితో మాట్లాడి,వెనక్కి చూస్తే మళ్ళీ పొయ్యి మండడం లేదు.కోపము,అసహనము,అసంతృప్తి,విసుగు,చీదర అన్నీ చుట్టుముట్టాయి.ఇంట్లోకి వెళ్ళాను.ఎవరు చూసినా చిటమటమంటున్నాను.ఎప్పుడూ శాంతమూర్తి లాగ,మొహమాటానికి ఎందుకు నవ్వాలి?ఒక్క సారైనా నా కోపమూ,విసుగూ అందరూ చూడనీ అనిపించింది.ఇంతలో మణిమాల వచ్చి అనింది.పద్మా!పొద్దున్నే ఊరికి వెళతానంటివే!ఇప్పుడే మేమందరమూ గీజర్ వేసుకుని వేడినీళ్ళతో స్నానాలు కానిచ్చాము. నాకు దిమ్మ తిరిగి పోయింది.ఇంట్లో గీజర్ ఉంటే కట్టెల పొయ్యి మండలేదని,కుంపట్లో నీళ్ళు సల సల కాగటం లేదని పొద్దుటి నుంచీ మధ్యాహ్నం దాకా టైము వేస్ట్ చేశానా నేను?ఏడవాలో,నవ్వాలో అర్థం కాలేదు.

Sunday, 17 May 2026

ఏమీ తెలియకుండా ఆఫీసర్ అయితే ఇట్లే ఉంటుంది!

బ్యాంకు నుంచి ఇంటికి వస్తున్నాను.సరిగ్గా రాములవారి గుడి వచ్చేటప్పటికి కరెంటు పోయింది.అంతా చిమ్మచీకటి.భయం భయంగా పోలీస్ స్టేషన్ వెనక నుంచి వెళ్ళాను.ఇంటికి వెళ్ళేటప్పటికి పెద్దన్నయ్య బుజ్జోడిని తీసుకుని వచ్చి ఉన్నాడు.నన్ను చూడగానే అడిగాడు.తల్లీ!మూడు రోజులు సెలవు పెట్టమ్మా!నాకు కొండపైన ట్రైనింగ్ ఉంది.కండలు పట్టేస్తున్నాయి.సొంతంగా లేయలేక పోతున్నాను.బుజ్జోడు నన్ను చూడగానే నవ్వుతూ నాదగ్గరకు వచ్చాడు.రామ ఏల పలుకవు పాడుతుంటే నాతో పాటు పాడుతున్నాడు.భజ గోవిందం పాడుతుంటే అది కూడా పాడుతున్నాడు.బుడ్డోడు అసలు ఎప్పుడు విన్నాడు?ఎప్పుడు నేర్చుకున్నాడు?వండర్ గా ఉంది. నాకు అసలు ఏమీ లీవులు లేవు.అన్నీ వాడేసాను.పెద్దన్నయ్య తోడు రమ్మంటున్నాడు.ఏమి చెయ్యాలి అర్థం కావటం లేదు.అసలు ముందు విషయం.లంచ్ బ్రేక్ 2-2.30నే.ఆఫీసర్లు మూడుకు గానీ రారు మామూలుగా.కాబట్టి బుజ్జోడిని ఇంకొంచెం ఆడించి బయలుదేరవచ్చు.ఇంతలో ఇంకొక ఆమె ఇంటికి వస్తే బుజ్జోడిని చూసుకోమని చెప్పి బయలు దేరాను.ఆఫీసు కెళ్ళగానే మేనేజర్ పిలిచాడు.నేను నవ్వుతూ,రిలాక్స్ గా మాట్లాడుతున్నాను.కానీ ఆయన అప్పటికప్పుడు ఆరు అకౌంట్ల లిస్ట్ ఇచ్చాడు.వాటికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ కావాలన్నాడు.నాకు పొట్ట పొడిస్తే అక్షరం ముక్క తెలియదు ఆ డీటైల్స్,స్టేట్మెంట్ల గురించి.అవి ఎలా చెయ్యాలో కనీసం ఎవరైనా చెబితే బాగుండు.అవన్నీ తెలిసిన మాఫ్రెండు ఇంకా రాలేదు.అంతదాకా ప్రాడక్ట్ వేస్తుంటాను అని డిసైడ్ అయ్యాను.ఇంతలో మెలకువ వచ్చింది.

Tuesday, 12 May 2026

మళ్ళీ ఒకటి,రెండు క్లాసులు పాస్ అయ్యాను!

ఎందుకో కాగితాలు వెతుకుతున్నాను.తీరా చూస్తే నా AIHSE సర్టిఫికేటు కనిపించలేదు.ఇప్పుడెట్లా?అందరూ నన్ను పొట్ట పొడిస్తే అక్షరం రాని మూగ మొద్దు అనుకుంటారు కదా!అయితే ఇప్పుడు ఇంక నేను ఒకటో క్లాసు నుంచీ పరీక్షలు రాసి పాసు కావాలి.గబగబా పేపరు,పెన్ను తీసుకుని ఇంట్లోనుంచే ఒకటో క్లాసు పరీక్ష రాసి పాసు అయ్యాను.రెండో క్లాసు పరీక్ష ఇంట్లోనుంచి రాస్తే ఒప్పుకోరేమో?సరే అని మా బడికి బయలు దేరాను.బడి చేరే టప్పటికి క్లాసులు మొదలు అయ్యాయి.లేట్ గా వచ్చిన వాళ్ళు ఆఫీసు దగ్గర నిలుచుకుని ఉన్నారు.నేనూ వాళ్ళ వెనక నిలుచుకున్నాను.వాళ్ళంతా బుడ్డి బుడ్జి పిల్లలు.నేనేమో వాళ్ళ టీచర్స్ కే అమ్మమ్మలాగున్నాను.అయినా ఇప్పుడు పరీక్షలు రాసి పాసు కావడం ముఖ్యం.అక్కడ చెప్తే ప్రక్కన కట్టిన షెడ్లలో ప్రైమరీ సెక్షన్స్ ఉన్నాయి అని చెప్పారు.నాకు తెలిసినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి.ఒక క్లాసు రూములో ఒక అబ్బాయి ఉంటే అడిగాను రెండో క్లాసు రూము ఎక్కడ అని.చెప్పాడు.ఆ రూముకు వెళ్ళి ఐవారుతో చెప్పాను.నేను ప్రైవేటుగా రెండో క్లాసు పరీక్షలు రాయాలని.తెల్ల కాగితం ఇచ్చి ప్రశ్నలు అడిగాడు.జవాబులు అన్నీ కలిపి అరఠావు మించలేదు.అప్పటికప్పుడే కరెక్ట్ చేసాడు.54%వచ్చింది.అమ్మయ్య!నేను పాసు అయ్యాను.ఇంక మూడో క్లాసు పరీక్ష రేపు రాయొచ్చా?అలా రోజుకు ఒక క్లాసు పరీక్ష రాస్తూ పోతే ఒప్పుకుంటారా?కొన్నేసి రోజులు గాప్ ఇచ్చి రాయాలా?ఆఫీసులో కనుక్కోమన్నారు.ఇంటికి వచ్చాను.మైథిలి స్కూటరు పైన మా ఇంచి మీదుగా వాళ్ళ ఇంటికి పోతూ కనిపించింది.ఒకటి,రెండు క్లాసులు పాస్ అయిన ఆనందం తనతో పంచుకునేదానికి,రయ్ అని వాళ్ళ ఇంటికి పరుగెత్తాను. ఇంతలో మెలకువ వచ్చింది.

Thursday, 7 May 2026

జ్యోతి టాకీస్ వెనక ద్వీపాలు,ద్వీపకల్పాలూ!

నిజానికి జ్యోతి టాకీస్ వెనక స్మశానం,తరువాత ఆర్ట్స్ కాలేజీ,దాని హాస్టలు,ఎస్వీ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్స్,లైబ్రరీ,యూనివర్సిటీ బిల్డింగ్స్ వస్తాయి.ఇదంతా నాకు కంఠోపాఠం.ఎందుకంటే ఎమ్.ఎస్సీ,రీసెర్చ్ చేసే టైమ్ లో తులసాపురం నుంచి రోజూ నడిచి వెళ్ళేదాన్ని. కానీ రాత్రి మటుకు కలలో జ్యోతి టాకీస్ వెనకాలే సముద్రం ఉంది.ఎక్సెర్సైజ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను.జిమ్ కంటే రోజూ సముద్రం దాకా నడిచి వస్తే పోతుంది కదా!అని ఆలోచన!ఆ ప్లేస్ పేరు గుర్తు రావడం లేదు.గుర్తు వచ్చేదానికి ఏముంది?నిజానికి దానికి శ్రీకారమా,ఓంకారమా లేక నామకరణమా?ఏమీలేదు కదా!చిన్నగా నడుచుకుంటూ పోయాను.జ్యోతి టాకీస్ దగ్గరలోకి రాగానే ఎవరో పద్మక్కా!పద్మక్కా!అని పిలిచారు.నా పాత క్లాస్ మేట్స్ ఏమో అని అక్కడక్కడే తిరిగాను.ఎవరో అమ్మాయి బయటకు వచ్చింది.తెలిసిన ముఖం కాదు.ఎవరో మా ఫ్రెండు చెల్లెలు అయి ఉంటుంది.కలలో కూడా తపనే,మనల్ని ఎవరో ఒకరు గుర్తించాలని,మాట్లాడాలని. సముద్రం దగ్గరకువెళ్ళాను.అలలు బాగా వస్తున్నాయి.చుట్టూరా చూసాను.దగ్గరలో అక్కడక్కడా బుజ్జు,బుజ్జి గుట్టలు లాగా నీళ్ళ మధ్య కనిపించాయి.అవే ద్వీపాలు అని మురిసి పోయాను.ఇంతలో మా వాళ్ళు వచ్చి నీళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళారు.నీళ్ళు భలే చల్లగా ఉన్నాయి.కొంచెం సేపటికి ఇంటికని వేను ఒక్క దాన్నేబయలుదేరాను.నీళ్ళలోకి వెళ్ళినా తల సరిగ్గా తడవలేదు.కాళ్ళూ,చేతులు తడవలేదు.ఒళ్ళంతా ఏదో తుంపరలు పడినట్లుంది .అంతే!ఇంతకీ నేను సముద్ర స్నానం చేసినట్లా?కాదా?ఇంటికి వెళ్ళి స్నానం చెయ్యాలా,వద్దా?అనే మీమాంస!

Tuesday, 14 April 2026

చిన్నక్కయ్య కారు తోలుతుంది

తెల్లవారు ఝామున కల!అందరమూ కారు దగ్గరకు వచ్చాము.డ్రైవరుకు వైజాగు వెళ్ళాలి.అక్కడ ఎక్కడికి వెళ్ళాలో చెబుతున్నాను.ఇంతలో చిన్నక్కయ్య కారు ముందు సీట్లో కూర్చుంది.సరే అని నేను వెనక కూర్చున్నాను.కొంచెం సేపు తర్వాత చూస్తే అక్కయ్య డేరైవింగు సీట్లో కూర్చుని స్టీరింగు తిప్పుతుంది.డ్రైవరు నా ప్రక్కన దిక్కులు చూస్తూ కూర్చుని ఉన్నాడు.ఒక్క క్షణం భయం వేసింది.అక్కయ్యా!అక్కడ కూర్చున్నావు ఏంది?నీకు అసలు కారు నడపడం వచ్చా?ఎప్పుడు నేర్చుకున్నావు?నేనెప్పుడూ ఇంతకు ముందు నువ్వు కారు డ్రైవ్ చేయడం చూడలేదు.అని అన్నాను. అక్కయ్య ఏమో తొణకలేదు.బెణకలేదు.తాపీగా అంటున్నది.నాకెందుకు రాదు?అంతకు ముందు అంతా పిచ్చి పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు కారుతోలేదాన్ని.ఈ మధ్యకాలంలో చేయడం లేదు,అంతే.నాకు ఇంకా భయం తీరలేదు.మరి అలాంటప్పుడు కొంచెం ప్రాక్టీసు ఉండాలి కదా!అందులో లోకల్ గా తిరగడం కాదు.హైవే పైన పోవాలి. నా కలల్లో నేను ఎప్పుడూ సైకిలు త్రొక్కుతున్నట్లు ఉంటుంది .ఇట్లా కార్లు,విమానాలు తోలుతున్నట్లు ఒక్కసారి కూడా రాలేదు.మా అక్కయ్య కారు తోలుతున్నట్లు వచ్చింది.మరీ మోసం కదా!ఇంకా ఎన్ని రోజులు సైకిలు తొక్కితే కారు డ్రైవింగ్ కి ఎలిజిబిలిటీ వస్తుందో ఈ కలల్లో!అస్సలు అంతు చిక్కడం లేదు.

Thursday, 26 March 2026

మరీ అంత భయమైతే ఎలా?

వెనకకు చూస్తే పెద్ద కొండలు.ముందుకు కొంచెం దూరం నడిచిన తరువాత లోయ వచ్చింది.మనుమరాలు కొసకు వచ్చి క్రిందకు తొంగి చూస్తుంది.అమ్మూ వెనకకు రా అని వెనక్కి లాగాను.క్రిందకు తొంగి చూస్తే ఏదో స్ట్రక్చర్ కనిపించింది.క్రిందికి వెళ్ళ వచ్చు కానీ మెట్లు లేవు.ఒక వైపు అంతా ఎవరో నిప్పు పెట్టారు.నల్లగా ఆకులు కాలి పోయి ఉన్నాయి.పాములు తిరిగే ప్రదేశం లాగుంది.దూరంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కనిపించాడు.మా అమ్మాయితో అన్నాను.అమ్మూ!ఇంక ముందుకు వద్దు.వెనక్కి వెళ్ళిపోదాము.మనము తప్పిస్తే ఇంకెవరూ లేరిక్కడ.అందులో పాములు తిరిగే ప్రదేశం లాగుంది. అక్కయ్య వాళ్ళింట్లో ఉన్నాను.హాలులో వాళ్ళ కుక్క ఉంది.వీథిలో రెండు కుక్క పిల్లలు కనిపిస్తే తెచ్చాము అని చెబుతున్నారు.చిన్నగా వంటింట్లోకి వెళ్ళాను.ఏమీ కనిపించలేదు అవి.అమ్మయ్య అనుకుంటే వెనక్కు తిరగ్గానే గబుక్కున రెండూ వెనకనుంచి నన్ను పట్టుకున్నాయి.అక్కయ్యా!కుక్క పిల్లలు నాన్ను పట్టుకున్నాయి.వదిలించండి!అవి వదలిపెట్టడం లేదు అంటూ హాలులోకి వచ్చాను.అవి వెనకలనుంచి తలదాకా పాకేసాయి.కరుస్తాయేమో,రక్కుతాయేమో అని భయంగా ఉంది. ఇది రాత్రి నాకొచ్చిన కల.మనం ఎంత భయస్తులం కదా!మొన్న ఆ మథ్య ట్రెక్కింగ్ కు వెళ్ళాము.ప్రతి నాలుగు మలుపులకీ నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి జాగ్రత్త!ఆలిగేటర్స్ ఉన్నాయి జాగ్రత్త అని వార్నింగ్ సైన్స్.పగలు కాబట్టి భయం అనిపించలేదు. అక్కయ్యవాళ్ళకు కుక్క ఉంది.పరమ సాథ్వి అది.అందరినీ ప్రేమిస్తుంది.బిడ్డలనయితే మరీ! సబ్ కాన్షస్ గా భయం ఇలా కలలాగా వచ్చింది అనిపించింది.

Sunday, 15 March 2026

Appreciation కోసం అర్రులు చాచడం

ఇంట్లో ఉన్నాను.మా పిల్లలు,అక్కయ్యవాళ్ళ పిల్లలను చూసుకుంటున్నాను.స్కూల్ డే లాగుంది.పిల్లలకు డాన్స్ మూవ్స్ నేర్పిస్తున్నాను.వాళ్ళు స్టేజ్ పైన ప్రదర్శించే రోజు వచ్చింది.పిల్లలు గ్రూప్స్ గ్రూప్స్ గా భలే చేస్తున్నారు.చాలా ముచ్చట వేసింది.ఇంతలో హెడ్ మాస్టరూ,సంగీతం టీచరూ నన్ను స్టేజ్ పైకి పిలిచారు.వెళ్ళగానే ఒక పాప వచ్చి నా పైన పూలు చల్లింది.ఆశ్చర్యం!ఏంది?నాకేనా ఈ పూలు చల్లడం?తేరుకునే లోపలే ఇంకో పాప కూడా వచ్చి మరిన్ని పూలు చల్లింది.హెడ్ మాస్టరు పిల్లలకు డాన్స్ నేర్పించినదానికి సభాముఖంగా మెచ్చుకున్నాడు.నాకు చాలా సంతోషమయింది. నాకు మా శివయ్య చిన్నాయన గుర్తొచ్చాడు.చిన్నప్పుడు నేను డాన్సులు చేస్తుంటే ఇంకా బాగా నేర్చుకో తల్లీ అనేవాడు.నువ్వు బాగా నేర్చుకుంటే వర్ల్డ్ టూరు తీసుకెళతాను.ప్రపంచం అంతా పెర్ఫార్మెన్సెస్ చేయిస్తాను అనేవాడు.ఆఖరికి కలల్లో పిల్లలకు డాన్సులు నేర్పించుకుంటూ,మన్ననలు పొందుతున్నాను.ఎక్కడికి తృప్తి?ఉన్నంతలో సరిపెట్టుకోవాలి కదా,ఎవరైనా!

Wednesday, 4 March 2026

అంతా ఇంతా కక్కుర్తి కాదు

మొన్న కలలో... వరండాలో అటూ ఇటూ తిరుగుతున్నాను.అమ్మాయి ఆఫీసు నుంచి సంతోషంగా వచ్చింది.ఏంది తల్లీ?అని అడిగాను.పిట్టగోడ పైన కూర్చుని,అమ్మా!నాకు జీతం పెరిగింది అనింది.వెంటనే నా నోటి నుంచి ఏమి వచ్చిందో తెలుసా?అవునా!అట్లయితే నాకు ప్రతి నెలా 200/ఇవ్వు.కాదు,కాదు.10%ఇవ్వు అని అడిగాను.సంతోషంగా ఒప్పుకుంది అమాయకపు తల్లి.నేనో!కక్కుర్తి తల్లిని.ఏమి గాడు?ముప్పూటలా తిండి తింటాను.సినిమాలూ,షికార్లూ,హోటళ్ళూ,గుడులు,గోపురాలు తిప్పుతారు.ఉత్సవ విగ్రహాన్ని తిప్పినట్లు వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి.ఇంక నాకెందుకు డబ్బులు?అదీ జీతంలో పర్సెంటేజ్!పదీ పరకా కాదు.ముసలితనం వచ్చేకొద్దీ కృష్ణా రామా అనుకోకుండా ఈ డబ్బు పిచ్చి ఏంది నాకు?నా వ్యవహారం పైన నాకే చిన్నతనంగా ఉంది.అవమానంగా ఉంది. పాత రోజుల్లో ఒక వయసు వచ్చిన తరువాత మోహాలు,శోకాలు,సంపదలు వదలి పెట్టి వానప్రస్థానికి బయలు దేరే వారంట!ఇప్పుడు అది కంపల్సరీ చేయాలి,కనీసం నా లాంటివారికి.లేకపోతే కలలో కూడా బిడ్డలను పర్సెంటేజ్ అడిగేది ఏంది?మరీ విడ్డూరం కాకపోతే!మనం మన తల్లిదండ్రులకు ఏమి ఇచ్చాము?ఇస్తామన్నా మా అమ్మ నాకెందుకే అంటూ బోసినోటితో నవ్వేది.ఆ నిర్మలమయినమనసు నాకు కూడా ప్రసాదించు దేవా!

Tuesday, 3 March 2026

సుగుణతో షికారుకు సై

మొన్నీ మథ్య కలలో... ఇంట్లో పిల్లలదెవరిదో పుట్టిన రోజు.మాఇంట్లో పుట్టిన రోజంటే పొద్దున్నే తలకు పోసుకోవడం,మథ్యాహ్నం పప్పు,పాయసం తినడం,సాయంత్రం వీలుంటే సినిమాకు వెళ్ళడం..అంతే!కానీ ఈ రోజు ఇంట్లో పది మంది దాకా ఉన్నారు.ఇంతలో సుగుణ వచ్చింది.రావే!రా!రా!అంటూ ఇంట్లోకి తీసుకుని వచ్చాను.తనను కూర్చోబెట్టి హడావుడిగా తిరుగుతున్నాను.ఒక అరగంట తర్వాత నాతో ఇలా అనింది.పద్మా!ఈ రోజు అంతా నిన్ను నాతో తిప్పుదామనుకుని నచ్చాను.సాయంత్రందాకా ఊరికే ఇట్లా కూర్చోలేను.నువ్వు వస్తే తీసుకెళతాను.లేకపోతే నేనొక్కదానినే వెళతాను అంది. నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు.ఎందుకంటే అంతకు ముందు ఒకసారి తనతో తీసుకెళ్ళింది.ఒక టివి షో రూము ఓపనింగు,ఒక రూరల్ హాస్పిటల్లో పోలియో డ్రాప్స్ ప్రొగ్రాము,ఒక గ్రామంలో పొంగళ్ళు,ఆ సభలో అనర్గళంగా తను అరగంట మాట్లాడడం,ఫ్రెండు ఇంట్లో భోజనము...తనకు అలవాటేమో గానీ నాకు మటుకు భలే సంతోషంగా ఉణ్ణింది తనను అలా నేరుగా చూడడం.గ్రేట్ కదా!చిన్నప్పుడు కలసి బడికి వెళ్ళిన వాళ్ళము,కలసి డాన్సులు,డ్రామాలూ వేసిన వాళ్ళము.గ్రౌండులో టెన్నీకాయిట్ ఆడుకున్న వాళ్ళము.ఇప్పుడు ఇంత పెద్ద పదవిలో ఉండి,అందరినీ రంజింప చేస్తుంది అంటే!అదేదో ఆ గొప్ప అంతా నాదే అన్నట్లు అనుభూతి.నేనే సాథించాను ఆ పేరు మొత్తం అన్నట్లు గర్వం! ఇప్పుడు మళ్ళీ పిలుస్తుంది తనతో తీసుకెళతానని.ఉండబట్టలేకపోయాను.ఒక్క క్షణం మనసు తటపటాయించింది. బిడ్డ పుట్టినరోజుకు ఇంట్లో బిడ్డతో ఉండకుండా బయటకు వెళ్ళడమా,అని.కానీ టెంప్టేషన్ తట్టుకోలేకపోయాను.నేరుగా పాప(ఆడబడుచు)దగ్గరికి వెళ్ళాను.పాపా!నేను ఇంట్లో వంటంతా చేసి పెట్టేసి పోతాను.ఇంట్లో ఎవరూ నన్ను అడగకుండా,నా అవసరము ఎవరికీ అక్కరలేకుండా ఉండేలా చూసుకో!పాప సరే వదినా అంది.ఇంకేమి అట్లయితే?సంతోషంగా ఎసరు పెట్టేదానికి వంటింట్లోకి బయలుదేరాను. thanks sunguna for lifting up my spirits even in dreams!

Sunday, 15 February 2026

జానీ లీవర్ ఇంటికి వచ్చాడు

రవి ఫోన్ చేసాడు.జానీ లీవర్ వచ్చాడు అని.రవీ!మా ఇంటికి కూడా తీసుకురావా అని బ్రతిమలాడాను.కొంచెం సేపటికి రవి,ఏవిఎస్ అతనిని తీసుకొచ్చారు.వాకిట్లోనే షేక్ హాండ్ ఇచ్చి ఇంట్లోకి తీసుకు వచ్చాను ముగ్గురినీ. కుర్చీలలో కూర్చున్నారు.నేను మొదటిసారి ఒక యాక్టరును కలవడం అని చెప్పాను.ఆ మధ్య మా మేనత్త కొడుకు,నాగడు కూడా మీతో ఫోటో తసుకున్నాడు.మీ సొంత ఊరు చీరాలా?బాపట్లా?ఇట్లా నాన్ స్టాప్ ప్రశ్నలు. కొంచెం ఉక్కగా ఉన్నట్లు ఉంది వరండా అయినా.ఫాన్ వేస్తామని లేచాను.వెనక ఇంటి పిల్లలు చూస్తున్నారా అని అడిగాడు.పిట్ట పురుగు లేదు.ఏమీ టెన్షన్ వద్దు.నీ ముఖం నా వైపు ఉంది.వీపు చూసి ఎవరు కనుక్కుంటారు నీవు యాక్టరు అని?నిశ్చింతగా ఉండు అన్నాను. ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి బెడ్రూములో పండుకోని ఉన్నారు.సరే,లేచేలోపల టీ పెడదాము అనుకుని టీ డబ్బా మూత తీసాను.టీ పొడిలో ఆకుపచ్చగా ఇంకేదో పొడి కలిసి ఉంది.పని పిల్లకు చూపిస్తే గరమ్ మసాలా పొడి కొద్దిగా మిగిలి ఉంటే మొన్ననే ఈ డబ్బాలో వేసాను అంది.దీనితో టీ పెడితే,ఏదో ఒక క్రొత్త ఫ్లేవరు అనుకోని తాగేస్తారా?లేక క్రక్కుకుని వాంతులు చేసుకుంటారా?జస్ట్ అనుమానం.అంతే. లేకపోతే ఇంక కాఫీ ఫిల్టరు వెయ్యాలి.చుక్కకు చుక్క దిగి ఎప్పటికి నలుగురికి కాఫీ పెట్టగలిగేంత డికాషన్ దిగేది?విసుగేస్తుంది.ఏమీ పాలుపోవడం లేదు. తలెత్తి చూసాను.మంచం కొసాన రెండు పావడాలు ఉన్నాయి.మూలన సూట్ కేసు పైన రెండు చీరలు మడత పెట్టి ఉన్నాయి.మరీ ఇలా ఉందేంటి అనుకుంటారా?అని అనుమానం.ఆఁ!ఇల్లు,సంసారం అన్నాక ఆ మాత్రం గందరగోళం కూడా లేకుండా ఎక్కడ ఉంటుంది అని తీసి పారేశాను. ఈ నెలలో నాలుగు అయిదు ఫంక్షన్సుకు వెళ్ళాలి.బీరువా తెరిస్తే అన్నీ పాత త్రాష్టాలే.ఒక్కటీ మంచిగా లేదు.1500-2000లలో నాలుగు అయిదు చీరలు కొందామా?లేకపోతే పదివేలల్లో ఒక్కటి కొందామా?అసలు ఎట్లాంటి చీరలు ఏ అంగట్లో దొరుకుతాయో తెలియదు.ఎవరిని అడుగుదాము?నేను సొంతంగా వెళ్ళాను అనుకో.దుప్పట్లు,లుంగీల లాంటివే కంటికి ఆనతాయి.అవి కట్టుకుంటే బాగున్నాయి అనే కాంప్లిమెంట్స్ దేవుడెరుగు.కనీసం కొత్తవని కూడా ఎవరూ గుర్తించరు.ఇప్పుడు ఎట్లా?ఏమి చెయ్యాలి?

Saturday, 14 February 2026

అమ్మ,ప్రసాదు కనిపించారు

ఈ రోజు ప్రసాదు(మా ఆయన)పోయిన రోజు.అలవాటు ప్రకారం అర్ధరాత్రి మెలకువ వచ్చింది.యథాప్రకారం కాఫీ త్రాగి,రామకోటి,భాగవతము,భగవద్గీత రాసుకుని అయిదప్పుడు పడుకున్నాను.కలలో.... చాలామంది గుంపుగా,గలభాగా ఉన్నారు.మథ్యలో రామ్ చరణ్ ఏదో పాటకు డాన్స్ చేస్తున్నాడు.గబుక్కున తల ఎత్తి నా వైపు చూసాడు.నేను చెయ్యి ఊపాను.ఎంత ఊపినా రెస్పాన్స్ ఇవ్వడే?మనది ట్యూబ్ లైట్ బుర్ర కదా!మూడు సందుల అవతల తను ఉన్నాడు.నేను మూడంతస్తుల నేడ పైన చీకట్లో ఉండి చేయి ఊపితే ,ఏ మానవ మాత్రుడికి కనిపిస్తుంది? ఇంట్లోకి వచ్చాను.మా చిన్నప్పటి ఆరో క్లాస్ ఫ్రెండు ఫోన్ చేసింది.నువ్వు ఎట్లున్నావే అంటే నువ్వు ఎట్లున్నావే అనుకున్నాము.యంగర్ డేస్లో ఎంత బాగా రెడీ అయ్యేదాన్నో,మా ఆయన కూడా డార్క్ కలర్ సూట్ వేసుకునేవాడు అంటూ తీపి జ్ఞాపకాలు నెమరువేసుకుంది.నేను ఏమైనా తక్కువ తిన్నానా?నేనూ చెప్పాను.అసలు మాఆయనకు నేను ఎట్లా ఉన్నా ఓకేనే. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు..ఏమయ్యా!ఈ చీర బాగుందా?లేక మార్చేదా?అని అడిగితే నువ్వు ఎట్లా ఉన్నా బాగుంటవు.ఏమీ మార్చబళ్ళేదు.పోదాం పద అనేవాడు అంటూ నేను కౌంటర్! కిటికీలోనుంచి చూస్తే పెద్దక్కయ్య కనిపించింది .గబగబా వెళ్ళి తలుపు తీసాను.అక్కయ్య పావడా పమిటలాగా చీర కట్టుకుని ఉంది.ఏంది ఇది కట్టుకున్నావు?పావడా పమిటనా,లేక అలాంటి చీరనా అని అడిగాను.ఈ మధ్య వాళ్ళెవరో పెట్టారులే.అందుకని కట్టుకున్నాను అని చెప్పింది.డ్యూటీ నుంచి వస్తూ,పెళ్ళికి వెళ్ళొచ్చాను.వాళ్ళు పద్మ రాలేదా అని అడిగారు.నీవు రాలేదని వంటకాలన్నీ నా దగ్గర పంపించారు.కంచాలు పెట్టుకోండి,వడ్డిస్తాను అంది అక్కయ్య. అమ్మను కూడా కూర్చోమన్నాను.అమ్మ కుర్చీలో కూర్చుంది కానీ టేబులు దగ్గరకు జరపలేక లేక పోతుంది.ప్రక్కలకు ఒరిగి పోతుంది.గబగబా వెళ్ళి అమ్మ కూర్చున్న కుర్చీ సరిగ్గా జరిపాను.నాకు బాథగా ఉంది.అమ్మ ఎన్నేళ్ళు ఎంత కష్ట పడింది!తన పెళ్ళైన ఎనిమిదవ ఏట నుంచి ఎనభై ఏళ్ళు వచ్చేదాకా కష్టపడుతూనేఉంది.మాకేకాదు,మా పిల్లలకు,వాళ్ళ పిల్లలకు కూడా!ఎన్ని సార్లు మంచాన పడింది?మళ్ళీ చిన్నగా కోలుకుని,తన పనులు తను చేసుకుంటుంది.ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు. అందరికీ వడ్డిస్తున్నాను.నాకు ఎదురుగా ప్రసాదు కూర్చున్నాడు.తనకు మంచి భోజనం తినాలంటే చాలా ఇష్టం.అనుకోకుండా పెళ్ళి భోజనం తింటున్నాము,మామూలుగా కాకుండా!గబగబా సాదకాలు వేసుకునే తొందరలో కూర గిన్నె బోర్లించేసాడు.ఆశ్చర్యం!నాకు కోపమే రాలేదు.చిన్నగా మళ్ళీ గిన్నెలోకి తీసాను.