Sunday, 15 February 2026

జానీ లీవర్ ఇంటికి వచ్చాడు

రవి ఫోన్ చేసాడు.జానీ లీవర్ వచ్చాడు అని.రవీ!మా ఇంటికి కూడా తీసుకురావా అని బ్రతిమలాడాను.కొంచెం సేపటికి రవి,ఏవిఎస్ అతనిని తీసుకొచ్చారు.వాకిట్లోనే షేక్ హాండ్ ఇచ్చి ఇంట్లోకి తీసుకు వచ్చాను ముగ్గురినీ. కుర్చీలలో కూర్చున్నారు.నేను మొదటిసారి ఒక యాక్టరును కలవడం అని చెప్పాను.ఆ మధ్య మా మేనత్త కొడుకు,నాగడు కూడా మీతో ఫోటో తసుకున్నాడు.మీ సొంత ఊరు చీరాలా?బాపట్లా?ఇట్లా నాన్ స్టాప్ ప్రశ్నలు. కొంచెం ఉక్కగా ఉన్నట్లు ఉంది వరండా అయినా.ఫాన్ వేస్తామని లేచాను.వెనక ఇంటి పిల్లలు చూస్తున్నారా అని అడిగాడు.పిట్ట పురుగు లేదు.ఏమీ టెన్షన్ వద్దు.నీ ముఖం నా వైపు ఉంది.వీపు చూసి ఎవరు కనుక్కుంటారు నీవు యాక్టరు అని?నిశ్చింతగా ఉండు అన్నాను. ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి బెడ్రూములో పండుకోని ఉన్నారు.సరే,లేచేలోపల టీ పెడదాము అనుకుని టీ డబ్బా మూత తీసాను.టీ పొడిలో ఆకుపచ్చగా ఇంకేదో పొడి కలిసి ఉంది.పని పిల్లకు చూపిస్తే గరమ్ మసాలా పొడి కొద్దిగా మిగిలి ఉంటే మొన్ననే ఈ డబ్బాలో వేసాను అంది.దీనితో టీ పెడితే,ఏదో ఒక క్రొత్త ఫ్లేవరు అనుకోని తాగేస్తారా?లేక క్రక్కుకుని వాంతులు చేసుకుంటారా?జస్ట్ అనుమానం.అంతే. లేకపోతే ఇంక కాఫీ ఫిల్టరు వెయ్యాలి.చుక్కకు చుక్క దిగి ఎప్పటికి నలుగురికి కాఫీ పెట్టగలిగేంత డికాషన్ దిగేది?విసుగేస్తుంది.ఏమీ పాలుపోవడం లేదు. తలెత్తి చూసాను.మంచం కొసాన రెండు పావడాలు ఉన్నాయి.మూలన సూట్ కేసు పైన రెండు చీరలు మడత పెట్టి ఉన్నాయి.మరీ ఇలా ఉందేంటి అనుకుంటారా?అని అనుమానం.ఆఁ!ఇల్లు,సంసారం అన్నాక ఆ మాత్రం గందరగోళం కూడా లేకుండా ఎక్కడ ఉంటుంది అని తీసి పారేశాను. ఈ నెలలో నాలుగు అయిదు ఫంక్షన్సుకు వెళ్ళాలి.బీరువా తెరిస్తే అన్నీ పాత త్రాష్టాలే.ఒక్కటీ మంచిగా లేదు.1500-2000లలో నాలుగు అయిదు చీరలు కొందామా?లేకపోతే పదివేలల్లో ఒక్కటి కొందామా?అసలు ఎట్లాంటి చీరలు ఏ అంగట్లో దొరుకుతాయో తెలియదు.ఎవరిని అడుగుదాము?నేను సొంతంగా వెళ్ళాను అనుకో.దుప్పట్లు,లుంగీల లాంటివే కంటికి ఆనతాయి.అవి కట్టుకుంటే బాగున్నాయి అనే కాంప్లిమెంట్స్ దేవుడెరుగు.కనీసం కొత్తవని కూడా ఎవరూ గుర్తించరు.ఇప్పుడు ఎట్లా?ఏమి చెయ్యాలి?

Saturday, 14 February 2026

అమ్మ,ప్రసాదు కనిపించారు

ఈ రోజు ప్రసాదు(మా ఆయన)పోయిన రోజు.అలవాటు ప్రకారం అర్ధరాత్రి మెలకువ వచ్చింది.యథాప్రకారం కాఫీ త్రాగి,రామకోటి,భాగవతము,భగవద్గీత రాసుకుని అయిదప్పుడు పడుకున్నాను.కలలో.... చాలామంది గుంపుగా,గలభాగా ఉన్నారు.మథ్యలో రామ్ చరణ్ ఏదో పాటకు డాన్స్ చేస్తున్నాడు.గబుక్కున తల ఎత్తి నా వైపు చూసాడు.నేను చెయ్యి ఊపాను.ఎంత ఊపినా రెస్పాన్స్ ఇవ్వడే?మనది ట్యూబ్ లైట్ బుర్ర కదా!మూడు సందుల అవతల తను ఉన్నాడు.నేను మూడంతస్తుల నేడ పైన చీకట్లో ఉండి చేయి ఊపితే ,ఏ మానవ మాత్రుడికి కనిపిస్తుంది? ఇంట్లోకి వచ్చాను.మా చిన్నప్పటి ఆరో క్లాస్ ఫ్రెండు ఫోన్ చేసింది.నువ్వు ఎట్లున్నావే అంటే నువ్వు ఎట్లున్నావే అనుకున్నాము.యంగర్ డేస్లో ఎంత బాగా రెడీ అయ్యేదాన్నో,మా ఆయన కూడా డార్క్ కలర్ సూట్ వేసుకునేవాడు అంటూ తీపి జ్ఞాపకాలు నెమరువేసుకుంది.నేను ఏమైనా తక్కువ తిన్నానా?నేనూ చెప్పాను.అసలు మాఆయనకు నేను ఎట్లా ఉన్నా ఓకేనే. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు..ఏమయ్యా!ఈ చీర బాగుందా?లేక మార్చేదా?అని అడిగితే నువ్వు ఎట్లా ఉన్నా బాగుంటవు.ఏమీ మార్చబళ్ళేదు.పోదాం పద అనేవాడు అంటూ నేను కౌంటర్! కిటికీలోనుంచి చూస్తే పెద్దక్కయ్య కనిపించింది .గబగబా వెళ్ళి తలుపు తీసాను.అక్కయ్య పావడా పమిటలాగా చీర కట్టుకుని ఉంది.ఏంది ఇది కట్టుకున్నావు?పావడా పమిటనా,లేక అలాంటి చీరనా అని అడిగాను.ఈ మధ్య వాళ్ళెవరో పెట్టారులే.అందుకని కట్టుకున్నాను అని చెప్పింది.డ్యూటీ నుంచి వస్తూ,పెళ్ళికి వెళ్ళొచ్చాను.వాళ్ళు పద్మ రాలేదా అని అడిగారు.నీవు రాలేదని వంటకాలన్నీ నా దగ్గర పంపించారు.కంచాలు పెట్టుకోండి,వడ్డిస్తాను అంది అక్కయ్య. అమ్మను కూడా కూర్చోమన్నాను.అమ్మ కుర్చీలో కూర్చుంది కానీ టేబులు దగ్గరకు జరపలేక లేక పోతుంది.ప్రక్కలకు ఒరిగి పోతుంది.గబగబా వెళ్ళి అమ్మ కూర్చున్న కుర్చీ సరిగ్గా జరిపాను.నాకు బాథగా ఉంది.అమ్మ ఎన్నేళ్ళు ఎంత కష్ట పడింది!తన పెళ్ళైన ఎనిమిదవ ఏట నుంచి ఎనభై ఏళ్ళు వచ్చేదాకా కష్టపడుతూనేఉంది.మాకేకాదు,మా పిల్లలకు,వాళ్ళ పిల్లలకు కూడా!ఎన్ని సార్లు మంచాన పడింది?మళ్ళీ చిన్నగా కోలుకుని,తన పనులు తను చేసుకుంటుంది.ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు. అందరికీ వడ్డిస్తున్నాను.నాకు ఎదురుగా ప్రసాదు కూర్చున్నాడు.తనకు మంచి భోజనం తినాలంటే చాలా ఇష్టం.అనుకోకుండా పెళ్ళి భోజనం తింటున్నాము,మామూలుగా కాకుండా!గబగబా సాదకాలు వేసుకునే తొందరలో కూర గిన్నె బోర్లించేసాడు.ఆశ్చర్యం!నాకు కోపమే రాలేదు.చిన్నగా మళ్ళీ గిన్నెలోకి తీసాను.