Sunday, 17 May 2026
ఏమీ తెలియకుండా ఆఫీసర్ అయితే ఇట్లే ఉంటుంది!
బ్యాంకు నుంచి ఇంటికి వస్తున్నాను.సరిగ్గా రాములవారి గుడి వచ్చేటప్పటికి కరెంటు పోయింది.అంతా చిమ్మచీకటి.భయం భయంగా పోలీస్ స్టేషన్ వెనక నుంచి వెళ్ళాను.ఇంటికి వెళ్ళేటప్పటికి పెద్దన్నయ్య బుజ్జోడిని తీసుకుని వచ్చి ఉన్నాడు.నన్ను చూడగానే అడిగాడు.తల్లీ!మూడు రోజులు సెలవు పెట్టమ్మా!నాకు కొండపైన ట్రైనింగ్ ఉంది.కండలు పట్టేస్తున్నాయి.సొంతంగా లేయలేక పోతున్నాను.బుజ్జోడు నన్ను చూడగానే నవ్వుతూ నాదగ్గరకు వచ్చాడు.రామ ఏల పలుకవు పాడుతుంటే నాతో పాటు పాడుతున్నాడు.భజ గోవిందం పాడుతుంటే అది కూడా పాడుతున్నాడు.బుడ్డోడు అసలు ఎప్పుడు విన్నాడు?ఎప్పుడు నేర్చుకున్నాడు?వండర్ గా ఉంది.
నాకు అసలు ఏమీ లీవులు లేవు.అన్నీ వాడేసాను.పెద్దన్నయ్య తోడు రమ్మంటున్నాడు.ఏమి చెయ్యాలి అర్థం కావటం లేదు.అసలు ముందు విషయం.లంచ్ బ్రేక్ 2-2.30నే.ఆఫీసర్లు మూడుకు గానీ రారు మామూలుగా.కాబట్టి బుజ్జోడిని ఇంకొంచెం ఆడించి బయలుదేరవచ్చు.ఇంతలో ఇంకొక ఆమె ఇంటికి వస్తే బుజ్జోడిని చూసుకోమని చెప్పి బయలు దేరాను.ఆఫీసు కెళ్ళగానే మేనేజర్ పిలిచాడు.నేను నవ్వుతూ,రిలాక్స్ గా మాట్లాడుతున్నాను.కానీ ఆయన అప్పటికప్పుడు ఆరు అకౌంట్ల లిస్ట్ ఇచ్చాడు.వాటికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ కావాలన్నాడు.నాకు పొట్ట పొడిస్తే అక్షరం ముక్క తెలియదు ఆ డీటైల్స్,స్టేట్మెంట్ల గురించి.అవి ఎలా చెయ్యాలో కనీసం ఎవరైనా చెబితే బాగుండు.అవన్నీ తెలిసిన మాఫ్రెండు ఇంకా రాలేదు.అంతదాకా ప్రాడక్ట్ వేస్తుంటాను అని డిసైడ్ అయ్యాను.ఇంతలో మెలకువ వచ్చింది.
Tuesday, 12 May 2026
మళ్ళీ ఒకటి,రెండు క్లాసులు పాస్ అయ్యాను!
ఎందుకో కాగితాలు వెతుకుతున్నాను.తీరా చూస్తే నా AIHSE సర్టిఫికేటు కనిపించలేదు.ఇప్పుడెట్లా?అందరూ నన్ను పొట్ట పొడిస్తే అక్షరం రాని మూగ మొద్దు అనుకుంటారు కదా!అయితే ఇప్పుడు ఇంక నేను ఒకటో క్లాసు నుంచీ పరీక్షలు రాసి పాసు కావాలి.గబగబా పేపరు,పెన్ను తీసుకుని ఇంట్లోనుంచే ఒకటో క్లాసు పరీక్ష రాసి పాసు అయ్యాను.రెండో క్లాసు పరీక్ష ఇంట్లోనుంచి రాస్తే ఒప్పుకోరేమో?సరే అని మా బడికి బయలు దేరాను.బడి చేరే టప్పటికి క్లాసులు మొదలు అయ్యాయి.లేట్ గా వచ్చిన వాళ్ళు ఆఫీసు దగ్గర నిలుచుకుని ఉన్నారు.నేనూ వాళ్ళ వెనక నిలుచుకున్నాను.వాళ్ళంతా బుడ్డి బుడ్జి పిల్లలు.నేనేమో వాళ్ళ టీచర్స్ కే అమ్మమ్మలాగున్నాను.అయినా ఇప్పుడు పరీక్షలు రాసి పాసు కావడం ముఖ్యం.అక్కడ చెప్తే ప్రక్కన కట్టిన షెడ్లలో ప్రైమరీ సెక్షన్స్ ఉన్నాయి అని చెప్పారు.నాకు తెలిసినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి.ఒక క్లాసు రూములో ఒక అబ్బాయి ఉంటే అడిగాను రెండో క్లాసు రూము ఎక్కడ అని.చెప్పాడు.ఆ రూముకు వెళ్ళి ఐవారుతో చెప్పాను.నేను ప్రైవేటుగా రెండో క్లాసు పరీక్షలు రాయాలని.తెల్ల కాగితం ఇచ్చి ప్రశ్నలు అడిగాడు.జవాబులు అన్నీ కలిపి అరఠావు మించలేదు.అప్పటికప్పుడే కరెక్ట్ చేసాడు.54%వచ్చింది.అమ్మయ్య!నేను పాసు అయ్యాను.ఇంక మూడో క్లాసు పరీక్ష రేపు రాయొచ్చా?అలా రోజుకు ఒక క్లాసు పరీక్ష రాస్తూ పోతే ఒప్పుకుంటారా?కొన్నేసి రోజులు గాప్ ఇచ్చి రాయాలా?ఆఫీసులో కనుక్కోమన్నారు.ఇంటికి వచ్చాను.మైథిలి స్కూటరు పైన మా ఇంచి మీదుగా వాళ్ళ ఇంటికి పోతూ కనిపించింది.ఒకటి,రెండు క్లాసులు పాస్ అయిన ఆనందం తనతో పంచుకునేదానికి,రయ్ అని వాళ్ళ ఇంటికి పరుగెత్తాను.
ఇంతలో మెలకువ వచ్చింది.
Thursday, 7 May 2026
జ్యోతి టాకీస్ వెనక ద్వీపాలు,ద్వీపకల్పాలూ!
నిజానికి జ్యోతి టాకీస్ వెనక స్మశానం,తరువాత ఆర్ట్స్ కాలేజీ,దాని హాస్టలు,ఎస్వీ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్స్,లైబ్రరీ,యూనివర్సిటీ బిల్డింగ్స్ వస్తాయి.ఇదంతా నాకు కంఠోపాఠం.ఎందుకంటే ఎమ్.ఎస్సీ,రీసెర్చ్ చేసే టైమ్ లో తులసాపురం నుంచి రోజూ నడిచి వెళ్ళేదాన్ని.
కానీ రాత్రి మటుకు కలలో జ్యోతి టాకీస్ వెనకాలే సముద్రం ఉంది.ఎక్సెర్సైజ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను.జిమ్ కంటే రోజూ సముద్రం దాకా నడిచి వస్తే పోతుంది కదా!అని ఆలోచన!ఆ ప్లేస్ పేరు గుర్తు రావడం లేదు.గుర్తు వచ్చేదానికి ఏముంది?నిజానికి దానికి శ్రీకారమా,ఓంకారమా లేక నామకరణమా?ఏమీలేదు కదా!చిన్నగా నడుచుకుంటూ పోయాను.జ్యోతి టాకీస్ దగ్గరలోకి రాగానే ఎవరో పద్మక్కా!పద్మక్కా!అని పిలిచారు.నా పాత క్లాస్ మేట్స్ ఏమో అని అక్కడక్కడే తిరిగాను.ఎవరో అమ్మాయి బయటకు వచ్చింది.తెలిసిన ముఖం కాదు.ఎవరో మా ఫ్రెండు చెల్లెలు అయి ఉంటుంది.కలలో కూడా తపనే,మనల్ని ఎవరో ఒకరు గుర్తించాలని,మాట్లాడాలని.
సముద్రం దగ్గరకువెళ్ళాను.అలలు బాగా వస్తున్నాయి.చుట్టూరా చూసాను.దగ్గరలో అక్కడక్కడా బుజ్జు,బుజ్జి గుట్టలు లాగా నీళ్ళ మధ్య కనిపించాయి.అవే ద్వీపాలు అని మురిసి పోయాను.ఇంతలో మా వాళ్ళు వచ్చి నీళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళారు.నీళ్ళు భలే చల్లగా ఉన్నాయి.కొంచెం సేపటికి ఇంటికని వేను ఒక్క దాన్నేబయలుదేరాను.నీళ్ళలోకి వెళ్ళినా తల సరిగ్గా తడవలేదు.కాళ్ళూ,చేతులు తడవలేదు.ఒళ్ళంతా ఏదో తుంపరలు పడినట్లుంది .అంతే!ఇంతకీ నేను సముద్ర స్నానం చేసినట్లా?కాదా?ఇంటికి వెళ్ళి స్నానం చెయ్యాలా,వద్దా?అనే మీమాంస!
Subscribe to:
Posts (Atom)